విభజనతోనే ఆంధ్రా వికాసం
– కేటీఆర్
న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాబివృద్ధి పథకాలను చేపడుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా ప్రణాళికా బద్దంగా నగర అభివృద్ది జరగలేదన్నారు. చెప్పినవిధంగా చేసి చూపుతున్న సిఎం కెసిఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంకు చెందిన పలు పార్టీకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాభివృద్దికి గత పాలకులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ మురికి వాడల్లో తిరిగి పేదల కష్టాలు తెలుసుకున్నారని వివరించారు. గతంలో మురికి వాడల్లో తిరిగిన ముఖ్యమంత్రులెవరు లేరని గుర్తు చేశారు.
గతంలో తెలంగాణ వస్తే ఆంధ్రులను వెల్లగొడతారని విషం చిమ్మి ఓట్లు పొందారని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఆంధ్రులెవరిపైనానా దాడులు జరిగాయా? అని మంత్రి ప్రశ్నించారు. విడిపోయి అభివృద్ధి చెందుదామనే నినాదంతోనే ఉద్యమం చేశామని తెలిపారు. ఇవాళ ఏపీ ఏపీగానే ఉంటే అభివృద్ధిచెందేదా? అని ప్రశ్నించారు. ఏపీ ఏర్పడటం వల్ల ఇవాళ అక్కడకు ఒక ఐఐటీ, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిమ్స్ వచ్చాయని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందామని ఆనాడే చెప్పామన్నారు. ఇక్కడ ఆంధ్రోళ్లకు పెన్షన్లు ఇవ్వొద్దని, ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ఎవరైనా అన్నారా? అని అడిగారు. ఇక్కడ స్థిరపడిన వారు కూడా టిఆర్‌ఎస్ కే ఓట్లు వేస్తారని అన్నారు. కొందరు కావాలని దుష్పచ్రారం చేశారని ,ఆంద్రవాళ్లు ఊళ్ల కు వెళ్లినప్పుడు ఎన్నికలు పెడుతున్నారని అన్నారని,అదంతా ఓట్టి మాట అని ఆయన అన్నారు. బరాబర్ ఆంద్ర ఓటర్లను కూడా టిఆర్‌ఎస్ కే ఓట్లు వేయాలని కోరతామని ఆయన అన్నారు. ఆంద్ర ఓటర్లు కూడా టిఆర్‌ఎస్ కే ఓట్లు వేస్తారని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో అన్ని వర్గాలను ఆదరించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ గెలిస్తే అది అవుతుంది..ఇది అవుతుంది అని కొందరు ప్రచారం చేశారని, ఎక్కడా ఏవిూ జరగకుండా ప్రశాంతంగా అంతా కలిసి మెలిసి జీవిస్తున్నామని కెటిఆర్ అన్నారు. ప్రజలమంతా కలిసే ఉన్నామని నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఐడీపీఎల్‌లో పేదల కష్టాలు చూసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తే ఏదో నాలుగు వందలు కట్టించి ఇచ్చాం ఇచ్చాం అని ప్రచారం చేసుకుంటున్నారని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయని తెలిపారు. వాళ్లు ఉన్నపుడు ఆ నాలుగు వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదు కదా అని తెలిపారు. పేకాట క్లబ్‌లను మూసివేయించి తమ అన్న సీఎం కేసీఆర్ తమ కుటుంబాలను కాపాడారని అక్కాచెల్లెల్లు అనుకుంటోన్న విషయాన్ని గుర్తు చేశారు.