విభజన హావిూలు గాలికొదిలిన పాలకులు

ఉమ్మడి పోరాటాలతో సాధించడం నేతల విఫలం
మోడీపై ఒత్తిడి పెంచడంలో కానరాని చిత్తశుద్ది
అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుభూతి ప్రకటిస్తున్నారా లేక..కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. అయితే గత ఎనిమిదేళ్లుగా మోడీ మాత్రం ఇంచు మాత్రం సాయం కూడా చేయకుండా కాలం గడపడంలో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరు గురించి, కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి గురించి మోదీ తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ చేసిన ఆ తప్పును సరిచేసేందుకు గత ఎనిమిదేళ్ళలోనూ దేశ ప్రధానిగా, సభానాయకుడిగా తాను ఎందుకు ప్రయత్నం చేయలేదో మోదీ ఎప్పుడూ చెప్పలేదు. చెప్పమని, పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభ్యుడూ ఆయన్ని అడగలేదు. దీనిని బట్టి కాంగ్రెస్‌ చేసిన ద్రోహం అందరికీ గుర్తు ఉండాలంటే, ఇరు రాష్టాల్ర ప్రజలూ ఆ పార్టీని ద్వేషించాలంటే, విభజన సమస్యలను పరిష్కరించకుండా సజీవంగా ఉంచడం ముఖ్యమని, తద్వారానే తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చునని బీజేపీ భావిస్తుందనుకోవచ్చు.
అందుకే విభజిత ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక స్థితికి ఊతమిస్తుందనుకొన్న పోలవరం, ప్రత్యేక హోదా అమలు విషయంలో ప్రత్యేక ప్యాకేజి నాటకానికి తెరతీసింది. విభజనపై జరిగిన అన్యాయాలపై సుప్రీంలో పిటిషన్‌ వేసి కొట్లాడాలని, పార్లమెంటులో చర్చ చేయాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పదేపదే కోరుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఉండవల్లి మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. కనీసం ఆయనతో చర్చించడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఎపి ఆర్థికస్థితి దివాళా తీయడానికి జగన్‌ పాలాన తీరు కూడా కొంత కారణంగా చూడాలి. డబ్బుల పందేరంతో ఖజానాను దెబ్బతీసారు. అనవసర పథకాలతో డబ్బును ఊడ్చేశారు. మరోవైపు సాయం చేయాల్సిన బిజెపి నేతలు ఆర్థిక దివాళా గురించి పదేపదే ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి లక్ష్యం వెనక్కి పోయింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర మధ్య విభజన సమస్యలు రావణకాష్ఠంలా మండుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలను బీజేపీ ఉపయోగించుకుంటోంది. ఇలా గత ఎనిమిదేళ్ళుగా అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అలాగే పరస్పర నిందారోపణలతో కాలం గడపటం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఉమ్మడిగా పోరాడాలన్న రాజకీయ స్ఫూర్తి లేకపోవడంతో ఎనిమిదేళ్లు గడిచినా కేంద్రం నుంచి సాధించేది ఏవిూ లేదని నిరూపించారు. విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్టాల్ర మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలకు సంబంధించిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి సైతం మోదీ సర్కార్‌ కృషి చేయలేదు. కొన్ని ఆస్తుల పంపకం విషయంలో వాటాలు కుదరక ఇరు రాష్టాల్రు వివిధ న్యాయస్థానాలను ఆశ్రయించినా కేంద్రం ప్రేక్షకపాత్ర మాత్రమే వహించింది. అలాగే ఇటీవల వేసిన త్రిసభ్య కమిటీ కూడా ఎలాంటి పురోగతి చూపలేకపోయింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటులో ఇచ్చిన హావిూలలో ఒక్కదాన్ని కూడా మోదీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్‌, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, వైజాగ్‌`చెన్నై పారిశ్రామిక కారిడార్‌, నిధుల లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు, ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి… ఇలా ఏ ఒక్క హావిూని కూడా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉన్నత విద్యాసంస్థలను మాత్రం ప్రారంభించి, వాటిలో మౌలిక సదుపాయాల కోసం నిధులను విడతల వారీగా
విడుదల చేస్తోంది. మిగతా హావిూల అమలుకు పార్లమెంటు సాక్షిగా వాటి అమలుకు మాకు పది సంవత్సరాలు సమయం ఉందని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నది. జాతీయ ప్రాజెక్టులకు అందే ప్రయోజనాలు కూడా పోలవరం విషయంలో అందడం లేదు.
విభజన వల్ల, రాజధాని కోల్పోవడం వల్ల నష్టపోతున్న ఆంధప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే పరిష్కారమని పార్లమెంటు ఉభయ సభలలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అధికార కాంగ్రెస్‌ ఐదేళ్లు మాత్రమే హోదా ఇస్తామంటే ప్రతిపక్ష బీజేపీ పదేళ్లు ఇవ్వాలని పట్టుపట్టింది. చివరకు ప్రకటించిన విధంగా ఐదేళ్ల ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ను మోదీ ప్రభుత్వం వంచించింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాలలో అదనంగా వచ్చే 30శాతం నిధులు ప్రత్యేకంగా ఇస్తామని ప్యాకేజీ క్రింద ప్రకటించింది. ఆంధప్రదేశ్‌లో పార్లమెంటు సభ్యులు` అధికారం, ప్రతిపక్షం రెండుగా చీలిపోయి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం విూరంటే విూరంటూ నిందించుకొంటూ, అసలు కారణం అయిన మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం ఉమ్మడిగా నిలదీయలేకపోయారు. దీంతో నష్టపోతున్నది మన రాష్ట్రమే అని వారు గుర్తించకపోవడంతో మోడీకి కలసి వస్తోంది.