విమానంలో లేఖ ఎవరు పెట్టారో తెలిసింది 

– కేంద్రమం అశోక్‌ గజపతి రాజు
న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి సోమవారం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. విమానంలో హైజాకర్లు ఉన్నారంటూ టాయిలెట్‌లో బెదిరింపు లేఖను గుర్తించడంతో అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ చేశారు. అయితే ఈ బెదిరింపు లేఖను విమానంలో పెట్టిందెవరో గుర్తించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తెలిపారు.
జెట్‌ఎయిర్‌వేస్‌ విమానంలో బెదిరింపు లేఖను పెట్టిన వ్యక్తిని గుర్తించాం. అతడిపై చర్యలు తీసుకున్నాం. ఆ వ్యక్తి పేరును అన్ని ఎయిర్‌లైన్‌ సంస్థలు తమ నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చాలి.’ అని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ట్వీట్లు చేశారు. అయితే ఆ వ్యక్తి పేరును కేంద్రమంత్రి వెల్లడించలేదు. కాగా.. సల్లా బిర్జు అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన ప్రయాణానికి భంగం కలిగించేందుకే తాను ఈ పనిచేశానని బిర్జు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై అటు అధికారులుగానీ.. ఇటు విమానయాన సంస్థగానీ స్పందించలేదు.