విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

1
– యూకే వెబ్‌సైట్‌ వెల్లడి

న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు లండన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయంలో ఇప్పటికే పలువురు పలురకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ వెబ్‌సైట్‌ ఆనాటి ఆధారాలతో ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లుగా ఉన్న ప్రచారాన్ని ధృవీకరించినట్లు అయ్యింది. అయితే ఆయన మృతిపై ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. దీని ప్రకారం..1945 ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి తైవాన్‌ రాజధాని తైపీ శివార్లలో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నేతాజీతో పాటు, అతని సన్నిహితుడు కల్నల్‌ హబిబర్‌ రెహ్మాన్‌ఖాన్‌ కూడా ఉన్నారు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీని సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఓ జపాన్‌ డాక్టర్‌ నేతాజీకి చికిత్స అందించారు. అనంతరం నేతాజీ కోమాలోకి వెళ్లిపోయారు. కొద్ది సేపటికే ఆయన మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడే పనిచేసిన నర్సు కూడా ధ్రువీకరించింది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేతాజీ ఓ ఇంగ్లిషు అనువాదకుడిని కోరినట్లు వారు చెబుతున్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలానని.. తన మరణవార్త భారత్‌కు తెలియజేయాలని నేతాజీ కోరుకున్నారు. ఈ విషయాన్ని నేతాజీ సన్నిహితుడు రెహ్మాన్‌ఖాన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఎప్పటికీ సేవలందించాలని ఆయన కాంక్షించినట్లు రెహ్మాన్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా నేతాజీ ఆ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు స్పష్టమవుతోందని ఆ వెబ్‌సైట్లో తెలిపారు. ఇప్పటివరకు నేతాజీ విమాన ప్రమాదంలోమరణించినట్లుగా ఉన్న ప్రచారాన్ని ఇది ధృవీకరిస్తోంది.