విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు
న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్రం. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దెనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నాయి. 2019 ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్ ఒకటో తేదీన ముగిసినా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాట య్యాయి. ఇక వచ్చేనెల నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదా రులకు జారీ చేసిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు కాబోవు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ బ్యాంకులు విలీనమైన బ్యాంకులకు సంబంధించిన చెక్‌బుక్ లు, ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లు, శాఖలు వాటి చిరునామా లను మారిపోనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ విలీనం అయ్యాయి. కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకుల కస్టమర్లు ఈ నెలాఖరులోగా తమ శాఖలను సంప్రదించి మారిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకులు.. ఇతర బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంకులు తమ ఖాతాదారుల మొబైల్ నంబర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ ఇస్తున్నాయి. అలాగే మారనున్న ఐఎఫ్ఎస్సీ కోడ్లు, ఎంఐసీఆర్ కోడ్ల గురించి మెసేజ్‌లు పంపుతున్నాయి. అయితే కొత్త బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు వచ్చే వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఖాతాదారులు తమ వెంట అట్టి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలతోపాటు, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అక్కౌంట్స్, బీమా పాలసీ, ఆదాయం పన్ను ఖాతాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ వద్ద వచ్చే జూన్ 30వ తేదీ వరకు పాత చెక్‌బుక్ అట్టిపెట్టుకుని లావాదేవీలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించారు.