విలువలతో కూడిన విద్య అవసరం

కేర్‌ ఆసుపత్రి ఎండీ శ్రీరామచంద్రమూర్తి
శ్రీకాకుళం, జూలై 30 : ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజానికి మేలు చేకూరుతుందని కేర్‌ ఆసుపత్రి ఎండీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డా. జి.శ్రీరామచంద్రమూర్తి అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక గురజాడ కళాశాలలో బీబీఎం, బీకాం మొదటి ఏడాది విద్యార్థుల ఆహ్వాన సభకు ఆయన తన భార్య రమతో కలిసి ముఖ్యఅతిథిగా హజరై విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. ఏ వృత్తిలో ఉన్నా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉపాధ్యాయుడు, వైద్యుడికి మంచి గుర్తింపు ఉందన్నారు. వైద్య వృత్తి మనిషి ఆరోగ్యాన్ని కాపాడితే, ఉపాధ్యాయ వృత్తి సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు మాట్లాడుతూ డాక్టర్‌ మూర్తి లాంటి వారు విద్యార్థిలోకానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారని అన్నారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి దంపతులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ అంబటి రంగారావు, అడ్వకేట్‌ జి.లక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్‌ పి.శ్రీనివాసరావు, మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి వి.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.