విలేకరులది చెత్త ఉద్యోగం!

న్యూయార్క్‌,ఏప్రిల్‌ 24: ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం అంటూ ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యాటక సంస్థ తెగ హడావుడి చేసింది.అది అత్యుత్తమమైతే..మరి అతి చెత్త ఉద్యోగమేంటంటారు?అమెరికా లోని ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘కెరీర్‌ కాస్ట్‌’ భారీ సర్వే చేసి మరీ ”అన్ని ఉద్యోగుమలందు బహుచెత్తది విలేకరి ఉద్యోగం” అని తేల్చెసింది.ఈ సర్వేలో భాగంగా ఆ సంస్థ దాదాపు 200 వృత్తి/ఉద్యోగాల్లో సాధకబాధకాలను,పనిచేసే వాతవరణాన్ని,ఆదాయాన్ని,ఉపాధి అవకాశాలను,ఒత్తిడిని..ఇలా రకరకాల అంశాలను విశ్లేషించి ఒక చిట్టా రూపొందించింది.

అందులో ఎంచక్కా 200వ స్థానం రిపోర్టర్‌ ఉద్యోగానికి పోటీ లేకుండా దక్కింది.కిందటేడాది అదే సంస్థ ఇదే అంశంపై సర్వే చేస్తే చెత్త ఉద్యోగాల లిస్టులో విలేకరులకు ఐదో స్థానం లభించింది.యూఎస్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌,ఇతర ప్రభుత్వ సంస్థల సమాచారం ఆధారంగా కెరీర్‌ కాస్ట్‌ ఈ జాబితాను రూపొందించింది.కాగా..ఈ జాబితాలో రిపోర్టర్ల తర్వాతి స్థానాల్లో చెట్లు కొట్టేవారు,సైనికులు,నటులు,ఆయిల్‌ రిగ్‌ కార్మికులు,డైరీ ఫార్మర్లు నిలిచారు.ఇక,అత్యుత్తమ కేటగిరిలో కిందటి సంవత్సరం సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అగ్రస్థానంలో నిలవగా ఈసారి ఆ స్థానాన్ని బీమా గణకులు దక్కించుకున్నారు.