వివాదాల్ని విడిచి టీమ్‌గా ఆడతాం

– కోచ్‌, ఆటగాళ్ల మధ్య సమన్వయం చాలా అవసరం

– మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌

వెలింగ్టన్‌, జనవరి14(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌ పర్యటనలో వివాదాల్ని విడిచిపెట్టి టీమ్‌గా దేశం కోసం ఆడతామని భారత మహిళల క్రికెట్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ టూర్‌ నేపథ్యంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ‘కొత్త ఏడాది.. అందులోనూ మొదటి పర్యటన కావడంతో గత ఏడాది జరిగిన వివాదాల్ని వదిలేసి ప్రెష్‌గా మ్యాచ్‌లు ఆడాలని ఆశిస్తున్నామన్నారు. రామన్‌ కొత్త కోచ్‌ కావడంతో టీమ్‌లోని క్రికెటర్లందరూ అతనితో చర్చిస్తున్నామని అన్నారు. జట్టు ప్రదర్శన మెరుగవ్వాలంటే.. కోచ్‌, ఆటగాళ్ల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. గతంలో ఎప్పుడూ కూడా అతని వద్ద శిక్షణ తీసుకోలేదని, అయితే ఓ రెండు మూడు సార్లు అతడితో కలిసి మాట్లాడానని అన్నారు. కోచ్‌గా చాలా జట్లకి పనిచేసిన అనుభవం అతనికి ఉండటం మాకు లాభించే అంశం అని మిథాలీ రాజ్‌ వెల్లడించింది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సెవిూస్‌ మ్యాచ్‌కి మిథాలీ రాజ్‌ని పక్కనపెట్టడం.. ఆ తర్వాత అప్పటి కోచ్‌ రమేశ్‌ పొవార్‌తో మనస్పర్థలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. కోచ్‌ పొవార్‌కి టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జి మద్దతుగా నిలవగా.. మిథాలీ రాజ్‌కి మాజీ క్రికెటర్లు, అభిమానులు అండగా నిలిచారు. అయితే.. ఎట్టకేలకి ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. సమస్యని పరిష్కరించి కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ని నియమించింది. ఈనెల 24 నుంచి న్యూజిలాండ్‌ పర్యటనకి వెళ్లనున్న భారత్‌ మహిళల జట్టు అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది.