విశ్వనగరమే లక్ష్యం
– జీహెచ్‌ఎంసీలో అవినీతి నిర్మూలిస్తాం
– భాధ్యతలు స్వీకరించిన మేయర్, డిప్యూటీ మేయర్
హైదరాబాద్ ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ రామ్మోహన్ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం మేయర్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పలువురు నగరవాసులు విలువైన సూచనలు, సలహాలు అందించారు. వీటితో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఉపాధి కేంద్రంగా మారడంతో అన్ని జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారనీ, వీరంతా నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. తాను వూహించని పదవి దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మేయర్ పదవి అప్పగించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. జీవితాంతం ఆయనకు రుణపడివుంటానన్నారు. కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడే కాదు… మార్గనిర్దేశకుడిగానూ ఉంటారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా కృషి చేయనున్నట్లు చెప్పారు. జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌లో మార్పులు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో మరిన్ని సులభ్ కాంప్లెక్స్‌లు ప్రారంభిస్తామన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చేస్తే సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని, విశ్వనగరం ఏర్పాటుకు యువ కార్పొరేటర్ల సహకారం తీసుకుంటామని రామ్మోహన్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దితో పాటు పౌర సదుపాయాల మెరుగుపై నూతన పాలక మండలిపై నగర ప్రజలు భారీ ఆకాంక్షలతో ఉన్నందున వారి ఆశలను నెరవేర్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రాంమోహన్ విజ్ఞప్తి చేశారు. మేయర్‌గా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించిన అనంతరం జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో డిప్యూటి మేయర్ బాబా ఫసియోద్దీన్‌తో కలిసి మేయర్ బొంతు రాంమోహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ రాంమోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. నగరంలో దీర్ఘకాలిక ప్రణాళికలను నిర్థారిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయడంతో పాటు చిన్న చిన్న సమస్యలకు వెంటనే స్పందించి పూర్తిచేయాలని అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే నగర సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని అన్నారు. పౌర సదుపాయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పనిలో వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరంలో తక్షణమే పూర్తిచేయాల్సిన పథకాలు, అన్ని విభాగాల్లో స్వల్పకాలిక కార్యక్రమాలపై 100రోజుల ప్రణాళికలను వెంటనే రూపొందించాలని కోరారు. నగరంలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడానికి నిధుల అవసరం ఉందని, ఇందుకుగాను ఆస్తిపన్ను వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని మేయర్ సూచించారు. పెద్ద ఎత్తున ఆస్తిపన్నుబకాయిదారుల నుండి ఆస్తిపన్ను వసూలు చేయడానికి తనతో పాటు డిప్యూటి మేయర్ కూడా ప్రత్యేకంగా కృషిచేస్తామని మేయర్ స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసిలో ఉన్న సిబ్బంది కొరత తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి చర్చించనున్నట్లు తెలియజేశారు. స్టాండింగ్ కమిటీలు, కో-ఆప్షన్ సభ్యులు ఎంపికకు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో చేపడుతున్న పలు పథకాలు, ఈ పథకాల అమల్లో ఎదురవుతున్న సవాళ్లను మేయర్‌కు వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్ నాయుడు, రామకృష్ణారావు, శంకరయ్య, రవికిరణ్, కెనడి, భాస్కరాచారి, చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్, చీఫ్ ఎక్సామినరీ ఆఫ్ అకౌంట్స్ నిరంజన్‌షా తదితర అధికారులు పాల్గొన్నారు.