విశ్వవిద్యాలయంలో మరో వృద్ధ విద్యార్థి

పట్నా: చదువుకు వయసుతో సంబంధంలేదని నిరూపించారు ఈ తాతయ్య.97ఏళ్ల వయసులో యువకులతో పోటీపడుతూ పీజీ పరీక్షలకు హాజరయ్యారు. ఎండవేడిని సైతం లెక్కచేయకుండా.. మూడు గంటల పాటు ఓపిగ్గా పరీక్ష రాశారు. బిహార్‌లోని నలందా ఓపెన్‌ యూనివర్శిటీలో ఎంఏ చదువుతున్న ఈ తాతయ్య పేరు రాజ్‌కుమార్‌ వైశ్య. మరీ సరస్వతి పుత్రుడి గురించి తెలుసుకుందామా..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ 1920లో జన్మించారు. ఆగ్రా యూనివర్శిటీ నుంచి 1940లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. అలా 1980లో ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యారు. అయితే ఇన్నేళ్లయినా ఉన్నత చదువులు చదవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. తన కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిశ్చయించుకున్న రాజ్‌కుమార్‌ గతేడాది నలందా ఓపెన్‌ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌లో చేరారు. ఎట్టకేలకు 97ఏళ్ల వయసులో ఎంఏ పరీక్షలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచారీ తాతయ్య.

రాజ్‌కుమార్‌ ప్రస్తుతం పట్నాలోని తన రెండోకుమారుడు సంతోష్‌తో కలిసి ఉంటున్నారు. సరైన ఆహారపు అలవాట్లు.. మానసిక ప్రశాంతత కారణంగానే ఇన్నేళ్లయినా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. నలందా యూనివర్శిటీలో రాజ్‌కుమార్‌ రెండో వృద్ధ విద్యార్థి. ఇటీవలే 84ఏళ్ల రామ్‌చంద్ర మిశ్రా అనే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఈ యూనివర్శిటీలో పీహెచ్‌డీలో చేరారు.