విశ్వసుందరి పౌలినా వెగా

akshaya

డోరాల్: కొలంబియాకు చెందిన పౌలినా వెగా ఈ ఏడాది విశ్వసుందరి (మిస్ యూనివర్స్)గా నిలిచింది.  మియామీలో జరిగిన  ఈ పోటీలో 22 ఏళ్ల మిస్ కొలంబియా వెగా 87 దేశాలకు చెందిన సుందరీమణులతో పోటీపడి ఈ టైటిల్ గెలుచుకుంది. బిజినెస్ విద్యార్థిని అయిన వెగా అమెరికా, ఉక్రెయిన్, జమైకా, నెదర్లాండ్స్ అందగత్తెలతో పోటీపడి ఈ విజయం సాధించింది. మిస్ యుఎస్ఏ నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుసాలు రన్నరప్లుగా నిలిచారు.

గతంలో మిస్ కొలంబియాగా ఎంపికైన ఈ బ్యూటీ కొలంబియా నుంచి విశ్వసుందరిగా నిలిచిన రెండవ అందగత్తె. సుదీర్ఘ కాలం తరువాత ఆ దేశ సుందరి ఈ కిరీటం గెలుచుకుంది.  1956లో ఈ దేశానికి చెందిన  మారినా ఈ టైటిల్ను గెలుచుకుంది.

ఇదిలా ఉండగా, భారత్ తరపున ఈ పోటీల్లో పాల్గొన్న నొయోనిత లాధ్  టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయింది.  ప్రముఖ బాలీవుడ్ నటి లారా దత్తా  2000లో విశ్వసుందరిగా ఎంపికయింది. ఆ తరువాత మన దేశ అందగత్తెలెవరికీ ఈ కిరీటం దక్కలేదు.