విశ్వస్థాయి బౌద్ధ క్షేత్రంగా సాగర్‌

5
– ఘనంగా శాంతిదూతకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్‌

నల్లగొండ,మే 4 (జనంసాక్షి):

నాగార్జునసాగర్‌ను ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చి దిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌కు వెళ్లి రావాలనుకునే రీతిలో శ్రీపర్వతారామంను అభివృద్ధి చేస్తామన్నారు.నాగార్జునసాగర్‌లోని బుద్దవనంను సీఎం సందర్శించారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో  మూడో రోజు జరుగుతోన్న టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  బుద్ద పౌర్ణిమ కావడంతో బుద్ద వనాన్ని సందర్శించి అక్కడ మొక్కలు నాటారు.ఘనంగా శాంతిదూతకు సీఎం కేసీఆర్‌   నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే జిల్లాలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఏరియల్‌ సర్వేలో భాగంగా ఆయన నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పరిశీలించారు. ముఖ్యమంత్రితోపాటు ఏరియల్‌ సర్వేలో మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులను పరిశీలన చేశారు.  ఆయన నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో కొనసాగుతోన్న టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతులకు హాజరై ప్రసంగించారు. అదనంగా కృష్ణా తీరంలో మరికొంత స్థలాన్ని కేటాయించి బుద్దభవనాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్‌ రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మారాలని ఇందు కోసం త్వరలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.నాగార్జనసాగర్‌ బౌద్ధరామానికి ప్రత్యేక అథారిటి ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.