వీధికుక్కల తరలింపున ప్రక్రియ తక్షణమే నిర్ణయాలు అమలు జరగాలి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌తో  పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నగర పౌరులు కోరుతున్నారు. ఊరకుక్కలను తరలిస్తామని చెప్పడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ ప్రక్రియను వీలయినంత త్వరగా ప్రారంభించి ప్రజలకు భరోసా కల్పించాలని హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ కె. కాశీనాథ్‌ కోరారు. సమస్యలను తెలుసుకుని అందుకు చర్యలకు ఉపక్రమించాలన్నారు. నగరంలో పెంచుకునే కుక్కల వల్ల కూడా ప్రమాదాలు రాకుండా వారి యజమానుల నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలన్నారు. ఇదిలావుంటే  గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి అర్వింద్‌కుమార్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌ , మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పెంపుడు కుక్కలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అర్వింద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగర, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌, టౌన్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌, రెసిడెంట్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మెప్మా స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు అర్వింద్‌కుమార్‌ సూచించారు. ఇది మంచి నిర్ణయమని కాశీనాద్‌ అన్నారు. ఈ పని తక్షణమే అమలయ్యేలా చూడాలన్నారు.