వీధి వ్యాపారులకు రుణాలు

నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేయనున్నట్లు సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్‌ సెహగల్‌ చెప్పారు. ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన (పీఎం స్వనిధి స్కీమ్‌) క్రింద దాదాపు 3 లక్షల మంది వీధి వ్యాపారులకు  వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా రుణాలు  పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం క్రింద వీథి వ్యాపారులు రాయితీ వడ్డీపై రూ.10,000 వరకు వర్కింగ్‌ కేపిటల్‌ను పొందవచ్చు.
పేద వీధి  వ్యాపారులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్‌ 1న ప్రారంభించింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్నవారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రుణ సదుపాయం కల్పిస్తున్నది. స్వయం సమృద్ధి భారత దేశం లక్ష్యంగా అణగారిన వర్గాలవారిని అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా రుణాల కోసం దరఖాస్తు చేశారు. వీరిలో సుమారు 12 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రూ.5.35 లక్షల రుణాలను పంపిణీ చేశారు.