వీరజవాను హనుమంతప్పకోసం సర్వమత ప్రార్ధనలు
హైదరాబాద్,ఫిబ్రవరి 10(జనంసాక్షి): సియాచిన్ ఘటనలో సజీవంగా బయటపడి దిల్లీలోని ఆర్మీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అలహాబాద్‌లోని గంగానదీ తీరాన ఆలయ అర్చకులు ఆయన ఈ గండం నుంచి బయటపడాలంటూ పూజలు, అభిషేకాలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హనుమంతప్ప తిరిగి ఆరోగ్యవంతంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గతవారం మంచు చరియలు విరిగిపడి సియాచిన్ సైనిక స్థావరంలో పది మంది సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో భారత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరు రోజుల తర్వాత బయటపడి ప్రస్తుతం దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గల్లంతయిన వారిలో హనుమంతప్ప మినహా మిగిలినవారు చనిపోయినట్టు ఆర్మీ ప్రకటించింది.