వీర జవాను హనుమంతప్ప ఇకలేరు

4

ఢిల్లీ,ఫిబ్రవరి 11(జనంసాక్షి):సియాచిన్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి జవాన్‌ లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు.హిమాలయ కొండచరియల పైనుంచి కిలోవిూటర్‌ ఎత్తు.. 800 విూటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్‌లోని  భారత సైనిక శిబిరంపై పడటంతో 9

మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్‌ హనుమంతప్ప ప్రాణాలతో ఉండటం వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమవారం హనుమంతప్పను వెలికితీసి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది. హనుమంతప్ప కోలుకోవాలని ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు ఆకాంక్షించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నిరంతరం శ్రమించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ హనుమంతప్ప ఈ రోజు మరణించారు. కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు.