వీళ్లకు రిజర్వేషన్లు అవసరమా?
– హార్థిక్ సన్మానంలో కరెన్సీ వర్షం
– హత్యలు చేయండి.. ఆత్మహత్యలొద్దు
– హార్ధిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్య
గుజరాత్ అక్టోబర్ 04 (జనంసాక్షి):
పటేల్ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న హార్దిక్ పటేల్‌పై కరెన్సీ వర్షం కురిసింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన పటీదార్ సన్మాన కార్యక్రమానికి పటేల్ హాజరయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న హార్దిక్‌పై ఇతర నేతలు, కార్యకర్తలు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీంతో.. వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. అయితే.. హార్దిక్ వారిని ఏమాత్రం వారించకుండా ప్రసంగం కొనసాగించడం గమనార్హం. కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించే వారికి రిజర్వేషన్లు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పటేళ్లకు రిజర్వేషన్‌లు కల్పించాలని ఉద్యమం చేపట్టిన హార్దిక్ పటేల్ శనివారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని, ఇద్దరు, ముగ్గురు పోలీసులను హత్య చేయండని పటేల్ యువతకు పిలుపు నిచ్చారు. ‘నీకు ధైర్యం ఉంటే వెళ్లి పోలీసులను చంపు. పటేళ్లు ఆత్మహత్యకు పాల్పడరు’ అని హార్దిక్ పటేల్ సూరత్‌లో వ్యాఖ్యానించారు. పటేళ్ల ఉద్యమానికి మద్దతుగా ఆత్మహత్యకైనా సిద్దంగా ఉన్నానని విపుల్ దేశాయి ప్రకటించడంతో శనివారం హార్దిక్ పటేల్ ఆ యువకుడిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి స్థానిక టివి ఛానళ్లను వెంటబెట్టుకు వెళ్లారు. ఈ వ్యాఖ్యలను టివిలు ప్రసారం చేశాయి. తనను ఆత్మహత్య చేసుకోవద్దని హార్దిక్ చెప్పినట్లు దేశాయి విలేకరులకు తెలిపారు. ‘మనము పటేళ్ల కుమారులమని, ఆత్మహత్య చేసుకుందామనే అలోచన కంటే ఇద్దరు, ముగ్గురు పోలీసులను హత్య చేయాలని నాకు సలహా ఇచ్చారు’ అని దేశాయి తెలిపారు. ఒబిసి కోటాలో పటేళ్లకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమాన్ని మొదలుపెట్టి, సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్‌పిజి) కన్వీనర్ లాల్జీ పటేల్ హార్దిక్‌కు దూరమయ్యారు. ‘మా ఉద్యమం గాంధేయ పద్దతిలో జరుగుతుంది. కాబట్టి ఎవరినీ చంపాలని మాట్లాడవద్దు. హార్దిక్ సరైన వ్యాఖ్యలు చేయలేదు. సమాజంలో ఒక వర్గానికి సంబంధించిన వ్యాఖ్యలు ఘర్షణలకు తావిచ్చేవిగా ఉండకూడదు’ అని లాల్జీ తెలిపారు. ఆయన విచక్షణతో కూడిన వ్యాఖ్యలు చేయాలని, పటేల్ కులానికి నాయకుడిగా ఆమోదించే ప్రకటనలు చేయాలని లాల్జీ హితవు పలికారు. ఇటువంటి వ్యాఖ్యలు తమ లక్షానికి హాని కలిగించేవిగా ఉంటాయని అన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు :
తాను ఇటువంటి సలహా ఇవ్వలేదని హార్దిక్ కొట్టివేశారు. తాను పోలీసులను చంపమని ఎటువంటి సలహా ఇవ్వలేదని, ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి వీడియో గానీ, ఆడియో గాని ఉన్న పక్షంలో నాపై చర్యలు తీసుకోవచ్చని’ అన్నారు. అగస్టు 25న జరిగిన ‘మెగా ర్యాలీ’ జరిగినప్పటి నుండి గుజరాత్ వ్యాప్తంగా హింసాత్మకంగా మారాయి.