వీసీ, కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోండి
– ఎస్.జయపాల్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. విద్యార్థి మృతికి సంతాపం ప్రకటించింది. దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయం ఘటనపై లేదని ఆయన విమర్శించారు. విద్యార్థి వేముల రోహిత్ మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని ఆయన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యుడు టి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. విశ్వవిద్యాలయం విద్యార్థులను సంఘవిద్రోహులుగా చిత్రీకరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులకు రక్షణ కల్పించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రోహిత్ మరణంపై కేంద్రం వ్యవహరించిన తీరు బాధాకరమని ఆయన అన్నారు. ఆంధప్రదేశ్ కాంగ్రెసు నేతలు కూడా విద్యార్తుల నిరవధిక దీక్షా శిబిరాన్ని శనివారంనాడు సందర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తును ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారు. రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తామని వారు చెప్పారు. కాంగ్రెసు పార్టీ తరఫున రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా పోరాటం చేస్తామని అన్నారు. విద్యార్థులను పరామర్శించినవారిలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు.