వృద్ధులు,యువతలో ఓకేలా పనిచేస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా

లండన్‌,అక్టోబరు 26(జనంసాక్షి):కరోనా నియంత్రణకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా తక్కువగా ఉందని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ ఆస్ట్రాజెనికా సోమవారం వెల్లడించింది. ‘టీకా తీసుకున్న వృద్ధులు, యువతలో రోగనిరోధక ప్రతిస్పందన ఒకేలా ఉంది. కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న వయసు మళ్లిన వ్యక్తుల్లో ప్రతికూల చర్యలు చాలా తక్కువగా ఉండటం ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే టీకా ఫలితాలు రోగనిరోధకత, భద్రతను మరింత వెల్లడి చేస్తాయి’ అని ఆస్ట్రాజెనికా అధికార ప్రతినిధి విూడియాకు వెల్లడించారు. వైరస్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే వృద్ధుల్లో టీకా రక్షిత యాంటీబాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపిస్తుందని ఇప్పటికే ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ విజృంభణతో కలవరపాటు గురైన ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఆశాజనకంగా కనిపించింది. ఇప్పుడు అన్ని దేశాలు దాని తుది ఆమోదం కోసమే ఎదురుచూస్తున్న తరుణంలో సంస్థ ప్రకటన సానుకూల పరిణామం. ఇదిలా ఉండగా..బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాన్‌కాక్‌ బీబీసీతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి టీకా సిద్ధంగా లేదని, అయితే, దాని పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే, తాము అన్నింటికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకాకు సంబంధించిన లైసెన్స్‌ను ఆస్ట్రాజెనికా సంస్థకు ఇవ్వగా..అది వివిధ దశలకు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించింది. త్వరలో చివరిదశ ప్రాథమిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా..ఈ సంస్థ తయారు చేస్తోన్న తొలివిడత టీకాను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమని లండన్‌ హాస్పిటల్‌ ట్రస్ట్‌ సిబ్బందికి ఆదేశాలు అందినట్లు అక్కడి విూడియా సంస్థ సోమవారం వెల్లడించింది. నవంబర్‌ రెండవ తేదీ నుంచి ఆ స్వీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే, ఆసుపత్రి వివరాలు మాత్రం వెల్లడికాలేదు.