వెంకయ్య ప్రమాణం

న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి):అదేకట్టు..అదే బొట్టు..ధవళవస్త్రాలతో ధగధగలాడే తేజస్సుతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో శుక్రవారం ఉదయం భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు. వెంకయ్య నాయుడు అను నేను.. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా ‘ అంటూ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మొదటిగా రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు. అటుపై మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు.. ఉపరాష్ట్రపతికి నమస్కరించారు. 10 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, విపక్షాలకు చెందిన కీలక నేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన వెంకయ్య.. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌, దీన్‌దయాళ్‌ ఉపాథ్యాయలకు కూడా వెంకయ్య పుష్పాంజలిఘటించారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పలుఉవరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. పలువురు నేతలతో పాటు వెంకయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై గెలుపొందిన సంగతి తెలిసిందే.

బహుముఖ ప్రజ్ఞాశాలి

వెంకయ్యనాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికీ మధ్య ఎప్పుడు ప్రతిష్టంభన నెలకొన్నా, దానిని తొలిగించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో పలుమార్లు భేటీ అయిన సందర్భాలున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉభయ సభల్లో ప్రతిపక్షం ప్రభుత్వంపై లేదా ప్రధానిపై దాడిని ఎక్కుపెట్టినప్పుడు ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టేవారు. వెంకయ్య పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రిగా ఉన్నప్పుడే స్మార్ట్‌ సిటీ మిషన్‌, అటల్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, అందరికీ ఇండ్లు వంటి పథకాలు ప్రారంభమయ్యాయి. గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించారు.భారత రాజకీయాలలో చిరపరిచితుడైన ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీలో పోస్టర్లు వేసే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉపరాష్ట్రపదవిని అలంకరించే వరకూ ఎదిగారు. ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, చవటపాలెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో 1949, జూలై ఒకటిన ఆయన జన్మించారు. బీజేపీకి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. బీజేపీకి మాతృసంస్థ అయిన జనసంఘ్‌లో కార్యకర్తగా 1970లో వెంకయ్య దిగ్గజ నేతలైన అటల్‌బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీల పోస్టర్లు వేసేవారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొనే వెంకయ్య

అనతికాలంలోనే నాయకునిగా ఎదిగారు. ఆయన రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసినప్పటికీ వెంకయ్య జనతాపార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తిరిగి 1983లో ఎన్టీ రామారావు ప్రాబల్యాన్ని తట్టుకొని అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వెంకయ్య కర్ణాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎన్నికయ్యే ముందు ఆయన రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు అద్వానీ ముఖ్య అనుచరునిగా ఉన్న వెంకయ్య 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి మోదీకి మద్దతు పలికారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖలు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో వెంకయ్య గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా 2002 జూలై నుంచి అక్టోబర్‌ 2004 వరకు పనిచేశారు. 2004 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ కార్యకర్తగా ఉన్న వెంకయ్య అరెస్టయి జైలు జీవితం గడిపారు.

రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్య బాధ్యతలు

ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌ లోని దర్బార్‌ హాల్‌లో ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ లో చైర్మన్‌గా వెంకయ్య ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని మోడీ సహా సభ్యులంతా అభినందించారు. తమతోటి సభ్యుడు ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం అభినందనీయమని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం వల్ల సభకు హుందాతనం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని మాట్లాడుతూ… ‘ రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడికి అభినందనలు. వెంకయ్యనాయుడు ఇదే సభలో సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు అదే సభకు ఛైర్మన్‌ అయ్యారు. ఓ రైతుబిడ్డ దేశ ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణంగా ఉంది. దేశంలో తొలిసారి గ్రామాల్లో జన్మించిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఒకేసారి ఎన్నికయ్యారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అయ్యారని మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడుకు రాజ్యసభ కార్యకలాపాల గురించి సంపూర్ణంగా తెలుసునని, అటువంటి నేత ఉపరాష్ట్రపతి కావడం సంతోషమని చెప్పారు. విద్యార్థి దశలో జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపు మేరకు సుపరిపాలన కోసం పోరాడారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి నేతగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, విధాన సభ, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలమైనదన్నారు. నేటి భారతదేశంలో గ్రావిూణ, పేద, అణగారిన వర్గాలవారు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య పరిణతిని తెలియజేస్తోందని, భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. ఇదంతా మన పూర్వీకుల గొప్పదనమన్నారు.వెంకయ్యనాయుడు ఏ మాధ్యమంలోనైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయనలా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. సభను హుందాగా నడుపుతారని ఆశిస్తున్నా.న్యాయవాది న్యాయమూర్తి అవుతారు. అలాగే రాజ్యసభ సభ్యుడు.. రాజ్యసభ ఛైర్మన్‌ అయ్యారు’ అని అన్నారు. వెంకయ్య నాయుడు తెలుగులో మాట్లాడితే సూపర్‌ఫాస్ట్‌గా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలరని ప్రశంసించారు. గ్రావిూణాభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేశారని, ప్రధానమంత్రి సడక్‌ యోజనను ఆయనే రూపొందించారన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యలను ఆయన బాగా అర్థం చేసుకోగలరన్నారు. రైతుల కష్టాల గురించి ఆయనకు బాగా తెలుసునన్నారు. న్యాయవాది మాదిరిగా ఇప్పటి వరకు మనతో కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఆసీనులయ్యారన్నారు.

రైతు బిడ్డగానే గర్విస్తా: వెంకయ్య

తానురైతుఏ బిడ్డను అని చెప్పుకోవడానికి గర్వపడతానని రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన కల్చర్‌ అగ్రికల్చర్‌ అంటూ ఆయన తనదైన శైలిలో తెలిపారు. తనకు అన్ని పార్టీలు సమానమని, అందరూ వివిధ పార్టీలకు చెందిన వారైనా తమ లక్ష్యం దేశా సమగ్రత, అభివృద్ది అన్నారు. దారులు వేరైనా గమ్యం ఒక్కటేనని అన్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులు తనకు సమానమేనని రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా సభ్యులకు అవకాశం ఇస్తామని… దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభలో నిర్మాణాత్మకంగా జరిగే చర్చలను విూడియా ప్రసారం చేయాలని సూచించారు. విూడియా ఎక్కువగా వివాదాలు, సంచలనాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.