వెనకబడిన గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు కృషి
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి,జూలై 24 (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వెనకబడిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండలం మాల్, కొత్తపల్లి, తక్కల్లపల్లి, గున్‌గల్ గ్రామాల్లో ఒక్కో గ్రామ పంచాయితీ 10 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. యాచారం మండలంలోని 5.16 కోట్లతో చేపట్టనున్న వాటర్‌షెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మంచాల మండల లోయపల్లి, బోడకొండ గ్రామాల్లో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాలను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల అదనపు తరగతి గదులు, కస్తూర్భా గాంధీ పాఠశాల భవనాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించడంతో పాటు గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోమంత్రి మాట్లాడుతూ యాచారం, మంచాల్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అన్ని గ్రామాలకు కృష్ణా నుంచి నీటిని అందించేందుకు కృషి చేస్తానని, ప్రతి గ్రామంలో కృష్ణా మంచినీటికై ప్రత్యేక పంపులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మాల్‌లో గల మార్కెట్‌ను ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీకి బదలాయించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, కృష్ణా నీరు సరఫరా చేస్తున్న గ్రామాలకు నీటి సామర్ధ్యాన్ని పెంచి ప్రజల అవసరాలకు సరిపడా నీటిని అందించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్, డ్వామా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పాటు ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.