వెయ్యిరూపాయలకే.. అందుబాటులో ఆక్స్ఫర్డ్ టీకా..
న్యూఢిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూణావాలా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్-2020లో మాట్లాడారు. ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు రూ.1000కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని, 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా వేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్, వ్యాక్సిన్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత అవసరమన్నారు.వ్యాక్సిన్ సమర్థతపై మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో బాగా పని చేస్తోందని రుజువు చేస్తోందన్నారు. టీ సెల్స్ ప్రతిస్పందననను ప్రేరేపించిందని, ఇది దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి, యాంటీబాడీ ప్రతి స్పందనకు సూచిక అనీ, అయితే టీకాలు దీర్ఘకాలికంగా రక్షిస్తాయో లేదో సమయం మాత్రమే చెబుతుందని, ప్రస్తుతం టీకాలకు ఎవరూ సమాధానం చెప్పలేరని పూనావాలా అన్నారు. అత్యవసర వినియోగం కోసం ఎస్ఐఐ ఎప్పుడు దరఖాస్తు చేస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ యూకే, యూరిపియన్ మెడిసిన్స్ ఎవాల్యుయేషన్ ఏజెన్సీ (ఈఎంఈఏ) ఆమోదించిన వెంటనే దేశంలో పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం ఫ్రంట్లైన్ కార్మికులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు పరిమిత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.వ్యాక్సిన్ పిల్లలకు వేసేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుందని, శుభవార్త ఏంటంటే పిల్లల్లో కొవిడ్-19 తీవ్రత లేదని చెప్పారు. విూజిల్స్ న్యుమోనియా మాదిరిగా కాకుండా వైరస్ ప్రాణాంతకమైందని, మహమ్మారి పిల్లల్లో రిస్క్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని, అయితే వాహకాలుగా మాత్రం మారవచ్చని, ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చన్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు పది కోట్ల డోసులను తయారీ చేయాలని సీరం ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ఇండియా తమ ప్రాధాన్యమని, ఈ సమయంలో సీరం ఇసిస్టిట్యూట్ ఇతర దేశాలతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం లేదని పూనావాలా స్పష్టం చేశారు. కాగా, ఆక్స్ఫర్డ్ రూపొందించిన టీకాను స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి పూణేకు చెందిన సీరం ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ పేరుతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది.