వేం నరేందర్‌ను ప్రశ్నించిన ఏసీబీ

2

– విచారణకు సహకరిస్తా

హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి):

తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డిని ఎసిబి సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఆరుగంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారని సమాచారం. అయితే విచారణ కోసం పిలిచి అరెస్టు చేశారని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఆయనను అరెస్టు చేయలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఇంటికి పంపివేశామని అధికారులు చెప్పారు. బయటకు వచ్చిన వేం నరేంద్ర రెడ్డి విూడియాతో మాట్లాడుతూ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పానని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు తెలిపారు. మేం ఏ తప్పు చేయలేదని, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందని, తప్పుడు కేసు పెట్టి తనను వేధించడానికే తెలంగాణ ప్రభుత్వం ఏసీబీని వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. తనను ఎప్పుడు పిలిచినా ఏసీబీ అధికారులకు కావాలసిన సమాచారం ఇవ్వడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాగా బుధవారం ఉదయం విచారణకు వచ్చిన వేం నరేందర్‌ రెడ్డిని  ఆరు గంటలపాటు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. మధ్యలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఏసీబీ కార్యాలయంలోనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన ఏసీబీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

సండ్ర ఇంటికి నోటీసులు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటికి మరోసారి ఎసిబి అదికారులు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో సండ్ర క్వార్టర్‌ గోడకు నోటీసు అంటి వచ్చారు. ఓటుకు నోటు కేసులో విచారించడానికి గాను ఎసిబి కార్యాలయానికి రావాలని సండ్రను ఎసిబి కోరింది. ఈనెల పందొమ్మిదో తేదీ సాయంత్రంలోగా హాజరు కావాలని ఎసిబి ఆదేశించింది.