వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ
మార్చి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ
రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు
ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్లడి
అనంతపురం,ఫిబ్రవరి26(జనం సాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ వేగంగా జరుగుతుందని.. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ టూ వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్‌కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు కీలక దశకు చేరింది. ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు. రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 వరకు అభ్యంతరాలు వచ్చాయని విజయ్ కుమార్ అన్నారు. ప్రతి అంశాన్ని పూర్వపరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటనేది చూస్తున్నామన్నారు. పుట్టపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఒక భావన వ్యక్తం అయిందన్నారు. పెనుకొండ , హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కోసం డిమాండ్ ఉందన్నారు. ఏ విధంగా జిల్లా కేంద్రం ఏర్పాటు ఉండాలనేది పరిశీలనలో ఉందని చెప్పారు. కలెక్టర్లు వారికి వచ్చిన అభ్యంతరాలు సలహాల విూద వాస్తవ పరిస్థితి ఏవిధంగా ఉందనే దానిపై ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ వస్తుందన్నారు. జిల్లాలు ఏ రోజు నుంచి ఆవిర్భావం అవుతాయనే దానిపై తుది నోటిఫికేషన్‌లో తెలియచేస్తామన్నారు. తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోకి నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు కలుస్తాయన్నారు. ఆ మండలాల వరకు మాత్రమే జోనల్ ఇష్యూ ఉందన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పమని విజయ్ కుమార్ తెలిపారు.