వేతనాలిచ్చి అదుకోండి

05విద్యుత్‌సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌
కరీంనగర్‌,మార్చి 30(జ‌నంసాక్షి): తెలంగాణా వ్యాప్తంగా ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలోని ట్రాన్స్‌కో పరిదిలోగల 33/11 కెవి సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేత నిత్యం వెట్టి చాకిరి చేయించుకుంటున్న యాజమాన్యం వేతనాలు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడంలేదని తెలంగాణా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆరోపించింది. యూనియన్‌ జిల్లా అద్యక్షుడు రవిందర్‌ రెడ్డి, డివిజన్‌ అద్యక్షుడు లక్ష్మణ్‌లు బుదవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్‌ వ్యవస్థపైన పనిచేస్తున్న కార్మికులు 1000 మందికిపైగా ఉన్నామని, తమను ఉద్యోగంలోంచి తీసెయ్యకుండా వేతనం ఇవ్వకుండా నిత్యం వేదింపులకు గురిచేస్తుందన్నారు. జిల్లాలో చాలా వరకు సబ్‌స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు కాంట్రాక్ట్‌కు ఇచ్చిందని అయితే వారి కాలపరిమితి డిసెంబర్‌తోనే ముగిసిందన్నారు. అయితే వారితో పాటు తమను కూడాతొలగించినా మా బతుకులు మేం బతికేవారమని, అలా చేయకుండా వేతనాలు ఇవ్వకుండా పనిచేయించుకుంటూ వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. మూడు నెలలనుంచి వేతనాలు లేకుండా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో యాజమాన్యమే చెప్పాలని వారు డిమాండ్‌చేశారు. ఈవిషయంపై ఎస్‌ఈని కలిస్తే చూస్తాం…చేస్తాం అనే సమాదానమే తప్ప తమకు వేతనాలు మాత్రం రావడంలేదన్నారు. అసలు మేం ఉన్నామా లేదా అనేది కూడా యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు. ఇప్పటికే ఒక్కో సబ్‌స్టేషన్‌ నిర్వహణ కాంట్రాక్ట్‌ నలుగురు ఐదుగురు మారారని, అయితే తాము మాత్రం ఎక్కడా మారలేదన్నారు. తమతోని పనిచేయించుకుంటున్న యాజమాన్యం నేరుగా వేతనాలివ్వడానికి ఎందుకు దైర్యం చేయడంలేదని నిలదీశారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఆందోలన బాట పట్టక తప్పదని వారు హెచ్చరించారు.