వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు
కరీంనగర్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): శివరాత్రికి ముందురోజు సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది శనివారం నుంచే ఇక్కడికి వేలాదిగా బక్తులు తరలివస్తున్నారు. సోమవారం కావడంతో భక్తుల రాక మరింత పెరిగి మహాశివరాత్రి ఉత్సవాలకు రాజన్న ఆలయం ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకోనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 17న ఉదయం 6.30కి స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శేషవస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారికి లఘు దర్శనం ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. లింగోధ్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ జరుపుతారు. రాజన్న సన్నిధిలో శివరాత్రి సందర్భంగా మూడు లక్షల లడ్డూలు, 12 క్వింటాళ్ల పులి¬రను సిద్ధం చేశారు. ఇందుకోసం ఆలయంలోని మహిషాసుర మర్థిని ఆలయం పక్కన భక్తులు బయటకు వెళ్లే దారిలో మూడు కౌంటర్లు, ఉత్తర రాజగోపురం ముందుభాగంలో ఒక కౌంటర్, భీమేశ్వరాలయం, తిప్పాపురం బస్టాండ్ వద్ద ప్రసాదాలు విక్రయించడానికి ఒక్కో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అయిదు విభాగాల్లో క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కోడె మొక్కుకై రూ.200 టికెట్‌పై దేవాలయం ముందు భాగం నుంచి సులభ్ కాంప్లెక్స్ వద్ద ప్రారంభమవుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు నాగిరెడ్డి మండపం నుంచి మహిషాసుర మర్థిని ఆలయం ముందు నుంచి దక్షిణ ద్వారం ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ వేములవాడకు 300 బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తోంది. ఇందుకోసం పట్టణంలో రెండు బస్సుస్టాండ్లను ఏర్పాటు చేశారు.