వేములవాడను జిల్లా కేంద్రం చేయాలి
-జగిత్యాలలోకలిపితే ఊరుకునేదిలేదు
-మార్నింగ్ వాకర్స్ ధర్నా
కరీంనగర్,మే 7 (జనంసాక్షి): తెలంగాణాలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతూ దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వాకర్స్ క్లబ్ డిమాండ్ చేసింది. తెలంగాణా ప్రభుత్వ అదినేత కేసీఆర్ నూతనంగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడమేకాక రూపకల్పనకు సంబందించి సమావేశాలు నిర్వహిస్తున్న సందర్బంగా వేములవాడ నియోజకవర్గాన్ని సుదూరంగా ఉన్న కొత్తగా ఆవిర్బవించనున్న జగిత్యాల జిల్లాలో కలుపాలనే ప్రతిపాదనలు చర్చకు రావడంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. ఇందులో బాగంగా శనివారం ఉదయం వేములవాడలోని మార్నింగ్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు వాకింగ్‌లో బాగంగా తెలంగాణా చౌక్‌కు వెల్లి అక్కడ గంటసేపు దర్నా కు దిగారు. జగిత్యాలలో కలుపడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. నిరసనలో బాగంగా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కరీంనగర్ జిల్లాలో ఉంచాలని లేదా వేములవాడనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరెండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తెలంగాణా తల్లి విగ్రహానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రతిపాదనలను విరమించుకోవాలని లేని పక్షంలొ ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.