వేములవాడలో చురుకుగా ఏర్పాట్లు

వేములవాడ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడలో శివరాత్రి వేడుకలు చురుకుగా సాగుతున్నాయి. ఏటా శిరాత్రి జాగారం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో దూస రాజేశ్వర్‌ తెలిపారు. అలాగే రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు  ఇవో పేర్కొన్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు.  స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.