వేములవాడలో నిరంతర శివస్తుతి
శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు
వేములవాడ,మార్చి1(జనంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శివార్చన వేడుకను ప్రారంభిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ యేడు కొత్తగా దీనిని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు శివున్ని కొలిచే భక్తి సంగీత కార్యక్రమాలతో సాంస్కృతిక శోభను నింపనున్నారు. 3వ తేదీన ప్రారంభమయ్యే మహాశివరాత్రితో దీనిని ప్రారభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వివరాలు వెల్లడించారు. 3వ తేదీన సాయంత్రం 6 గంటలకు వేడుకలు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగుతాయి. 4వ తేదీ జాగరణోత్సవం పేరుతో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఉదయం 7 గంటల వరకు సుమారు 13 గంటల పాటు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతాయి. శివస్థుతికి సంబంధించిన అంశాలకే ప్రాధాన్యతను ఇస్తూ నృత్యాలు, శివున్ని కొలిచే వివిధ కార్యక్రమాలుంటాయి. ఇందులో స్థానిక ఒగ్గు కళాకారుల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ స్థాయి కళాకారులు కూడా అంతర్జాతీయ ప్రదర్శనలు ఇస్తారు. దాదాపు 2 వేల మంది కళాకారులు 21 గంటల పాటు కార్యక్రమాలను అందిస్తారు. వంద మంది కళాకారులు పేరిణి శివతాండవం, లాస్యంను భక్తులకు నివేదించబోతున్నారు. 9 రకాల వాయిద్యాలతో కూడా గొప్పగా సంగీత కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ సంగీత కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయన్నారు. 80 వేల మంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు.