వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు. అప్పుల బాధతో ఒక రైతు బలవన్మరణం చెందగా మరో రైతు విద్యుదాఘతానికి గురై మరణించాడు. కరీంనగర్‌జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రైతుకు 2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగ్గా పండక అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరు అయ్యింది.

ఇకపోతే సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంకు చెందిన రైతు పర్సా రమేష్‌(32) వ్యవసాయ బోర్డు స్విచ్‌ ఆఫ్‌ చేస్తుండగా కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. కాగా, సంఘటనా స్థలంలో రమేష్‌ను కాపాడేందుకు యత్నించిన మేనత్త సుభద్రకు కూడా విద్యుత్‌ షాక్‌ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండ్రోజుల క్రితమే ట్రాన్‌ఫార్మర్‌పై మరమ్మత్తు చేస్తూ ఓ రైతు కరీంనగర్‌ జిల్లాలో మృతి చెందాడు.