వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
మృతుల్లో ఓ మహిళ..ఓ స్టూడెంట్
హైదరాబాద్,ఆగస్ట్29(జనంసాక్షి): వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇందులో ఓ మహిళ,యువకుడు ఉన్నారు. హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల మల్లంపేటలో మంగళవారం టిప్పర్ ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. రోడ్డుపై వెళుతున్న ముస్లిం మహిళను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో లారీ మోపెడ్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో నారాయణ అనే వృద్ధుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రభుత్వ కాలజీ దగ్గర ఇంటర్ విద్యార్థులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఘటనలో ఒకరు అక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృత దేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెనపై రోడ్డుప్రమాదం జరిగింది. మూడు లారీలుఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.
ఇక ఇదే జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి, ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.