వైఎస్సార్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి
ఖమ్మం,నవంబర్ 21: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ సిపిలో చేరిన ఆయన ఇక జిల్లాలో పార్టీ అభివృద్దిపై దృష్టి సారిస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, చట్టసభల ఎన్నికలు ఏవి వచ్చినా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసేలా పార్టీ శ్రేణులను నడుపుతామన్నారు. వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాలన అని అన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీని ప్రజలు నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైందని, జిల్లాలో ఇతర పార్టీల నుంచి నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.