వైఎస్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
ఖమ్మం, డిసెంబర్ 8): మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. 2004-09 సంవత్సరాల్లో కేవలం వైఎస్‌ఆర్ చరిష్మాతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆ మహానుభావుడిని గుర్తించుకోవాల్సిన ప్రభుత్వం అలా చేయకుండా ఆయన కుమారుడిని వేదిస్తూ జైలు పాలు చేసిందని అన్నారు. వైఎస్‌ఆర్ సిపి సత్తా ఏమిటో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలిసిందని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇతర ప్రజాకర్షక పథకాలన్నింటినీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు రెండు భూస్థాపితం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు.