వైభవంగా అంతర్వేది ఉత్సవాలు
స్వామి కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తుల రాక
రాజమండ్రి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సాఫీగా సాగేందుకు పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 12.35 గంటల నుంచి అర్చకులు కళ్యాణానికి సంబంధించిన క్రతువులను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్టాల్ర నుంచి పెద్ధ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 12.35 గంటలకు వృచిక లగ్నం, వేదమంత్రాలు, మేళా తాళం, సంప్రదాయ వాద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పట్టువస్త్రాలతో అలంకరించి కల్యాణం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సమ్మిట్ కుమార్, ఆర్డీఓ ఎన్‌ఎస్వీబీ వసంతరాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సజావుగా సాగేందుకు 1,560 మంది పోలీసులను మోహరించారు.