వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు..  మరోసారి చుక్కెదురు

– పిటీషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
– మరోసారి రివ్యూఫిటీషన్‌ వేస్తానని ఆళ్ల వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీలో సాధికార మిత్రల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా, పంచాయతీరాజ్‌ స్పూర్తికి వ్యతిరేకంగా సాధికార మిత్రలను నియమించారని గతంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం ధర్మాసన విచారించింది. దీనిపై పిటిషనర్‌ వాదనలు విన్న కోర్టు దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ధర్మాసనం తీర్పుపై ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడారు..  ప్రభుత్వం సొమ్ముతో అధికారులను నియమించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రతి 35కుటుంబాలకు ఒక సాధికార మిత్రలను నియమించి ఆయా కుటుంబాలు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలుసుకుని అధికార పార్టీకి సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. సాధికార మిత్రలకు వేతనం ఇవ్వడం లేదంటూనే వెయ్యి కోట్ల రూపాయలతో స్మార్ట్‌ ఫోన్లను ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని విమర్శించారు. తమ వాదనతో సుప్రీంకోర్టు ఏకభవించలేదని.. దీనిపై మరోసారి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.