వ్యక్తిగత మరుగదొడ్లపై చైతన్యం చేయాలి
కరీంనగర్,ఫిబ్రవరి17 (జనంసాక్షి) : స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పరిశేఉభ్రత పాటించేలా, మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహకం ఇస్తుందన్న విషయం వివరించాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు వీటిపై
అవగాహన ప్రచారం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇక పెన్షన్ల పంపిణీలో సదరం ధ్రువీకరణ తనిఖీ చేసి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. ముగ్గురు వైద్యుల సంతకం చేయని ధ్రువపత్రాలను ఎంపీడీవోలు సేకరించి వాటిని డీఆర్‌డీఏకు పంపించాలన్నారు.దళితులకు భూమి కొనుగోలు పథకం పనులు వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్ గుర్తించిన భూములను, భూగర్భ జలశాఖ, వ్యవసాయశాఖ అనుమతులను తీసుకొని వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తహసీల్దార్ నుంచి ప్రతిపాదనలు పంపడం ఆలస్యమవడంతో నిధులు ఖర్చు చేయలేకపోతున్నామని చెప్పారు.
జిల్లాలో ప్రభుత్వ జీవో 58 ప్రకారం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల కంప్యూటరీకరణ, అప్‌లోడింగ్ పక్రియ నెమ్మదిగా సాగుతోందన్నారు. తనిఖీలో 125 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఆవాసాలు ఉన్నట్లు గుర్తిస్తే.. దరఖాస్తులను తిరస్కరించి, జీవో 59 ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సంబంధితులకు సూచించాలని చెప్పారు. ఇదిలావుంటే హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్, సోషల్‌స్టడీ వారు జిల్లాలో బాలల స్థితిగతులపై ఈనెల 18న డ్వామా సమావేశ మందిరంలో అధ్యయన నివేదికను ప్రదర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు. జిల్లాలో నాలుగోసారి సర్వే చేశారని తెలిపారు. 2013లో చేసిన సర్వే రిపోర్టు వివరాలను పవర్
పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరుకావాలని కోరారు.