వ్యర్థ పదార్థాల నుంచి నోట్‌ బుక్కుల తయారీ

పేద విద్యార్థులకు ఉచిత పంపిణీ చేస్తున్న యువత ఎన్జీవో

ఎన్జీవో ప్రతినిధులను అభినందించిన మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి):వ్యర్థ పదార్థాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌ బుక్స్‌ తయారు చేసి, ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇచ్చే మంచి కార్యక్రమాన్ని చేస్తున్న యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అభినందించారు. కార్పోరేట్‌ కంపెనీలు, వ్యాపారాలు చేసే యువకులు కలిసి ఏర్పాటు చేసుకున్న యువత స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ కంపెనీల్లోని వేస్ట్‌ పేపర్లను వీరే స్వయంగా సేకరించి వాటిని నోట్‌ బుక్స్‌గా తయారు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ¬మ్స్‌లలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 35వేల కేజీల వేస్ట్‌ పేపర్‌ను సేకరించడం ద్వారా లక్ష నోట్‌ బుక్స్‌ తయారు చేస్తున్నారు. దీనివల్ల 700 చెట్లను కూడా నరకడం నుంచి పరిరక్షించవచ్చని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి ఇది దోహదపడే కార్యక్రమమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మిగిలిన యువత కూడా వీరినుంచి స్పూర్తి పొందాలన్నారు.