వ్యవసాయంలో రైతులకు మెళకువలు
గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు
సాగు ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం
జనగామ,మే30(జనంసాక్షి): జిల్లా ఆవిర్భావం తర్వాత జిల్లాకు కొత్తగా 39 మంది ఏఈవోలు నియామకం కావడంతో వ్యవసాయ ప్రణాళికపై వీరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. విత్తనాలు మొదలు, ఎరువుల వాడకం వరకు ఏయే పంటలు వేయాలో వివరిస్తున్నారు. వీరు సాగులో రైతులకు సాయం అందించే పనిలో నిమగ్నమయ్యారు. వానకాలం సీజన్‌లో రైతులు ఏరకం పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలు నాటాలి, ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన మోతాదు , వానలు కురిసిన తర్వాత విత్తనాలు నాటాలి? వంటి మెళకువలపై ఏఈవోలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుండడంతో గతంలో కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో వ్యవసాయ శాఖ అధికారుల సంఖ్య తక్కువగా ఉండి ఒక్కొక్కరు రెండుమూడు మండలాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో రైతులకు సరైన సలహాలు, సూచనలు అందలేదు. దీంతో రైతులు ఇష్టానుసారంగా పంటలు సాగు చేసి విచ్చలవిడిగా ఎరువులు, పురుగుల మందులు వాడి నష్టపోయారు. పంట రకాలు, విత్తనాలపై అవగాహన లేక బోగస్ కంపెనీల ప్రచారంతో కొందరు రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వ్యవసాయ శాఖలో వినూత్న మార్పులు చోటుచేసుకున్న ఫలితంగా జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలతో వ్యవసాయంలో అధికారుల పాత్ర పెరిగింది. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే దిగుబడి వస్తుందనే అంశంలో వేసవిలోనే మట్టి నమూనాలను సేకరించి భూసార వివరాలను కంప్యూటరీకరణ చేయడం వంటి పరిణామాలు మేలు చేయనున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, భూములు, బోర్లు, బావుల కింద సాగయ్యే పంటలపై సమగ్ర సర్వే నిర్వహించారు.జిల్లాలో వానకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన అంచనాలతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందనే వాతావరణ శాఖ అంచనాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జిల్లాలో 1,15,138 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 50 శాతం విత్తనాలు, 60 శాతం ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి పలకరించగానే విత్తనాలు నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. వానకాలం సాగు యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెలాఖరు నుంచే వ్యవసాయ పనులు ఆరంభించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూసారాన్ని పెంచుకునేందుకు రైతులు ఇప్పటికే ఒండ్రు మట్టి, పశువుల పేడను పంట చేలల్లోకి తరలించుకున్నారు. ఈ నెల 25న రోహిణి కార్తె ఆరంభం అవుతుండగా, మృగశిర ప్రవేశించిన తర్వాత వర్షాలు పడగానే విత్తనాలు వేసుకునేందుకు వీలుగా విత్తన ప్యాకెట్లు, ఎరువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు.జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిసాగు చేస్తుండగా, తర్వాత వరి, మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. వానకాలం సీజన్‌లో జిల్లా రైతాంగానికి అన్ని పంటలకు కలిపి మొత్తం 51,274 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానకాలంలో చెక్కులు, యాసంగి సాగుకు నేరుగా రైతు ఖాతాలకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున పంట సాయం అందింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ మేరకు రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట సాయం పెంచింది. దీంతో జూన్ మొదటి వారంలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు సాయం అందబోతున్నది.