వ్యవసాయాన్ని పండగ చేశాం
అధిక నిధులతో ముందున్నాం: పోచారం
కామారెడ్డి,అక్టోబర్1(జనంసాక్షి): రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించింది కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్‌లోకి తీసుకోచ్చి ఉమ్మడి జిల్లాల రైతుల పాదాలను కడుగుతామని మంత్రి హావిూ ఇచ్చారు. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే రైతుల కలను సాకారం చేసి నిజాంసాగర్ ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోమారు కెసిఆర్‌ను సిఎం చేయాలన్నారు. అందుకుప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌నే బలపర్చాలన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద, బడుగు, బలహీనవర్గాల ముఖాల్లో వెలుగులు నింపామని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రతీ కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందించేలా ప్రభుత్వం పని చేసిందని అన్నారు. రాష్ట్రాన్ని 50 ఏండ్లు కాంగ్రెస్, 17 ఏండ్లు టీడీపీ పాలించగా.. కేవలం నాలుగున్నర సంవత్సర కాలంలోనే టీఆర్‌ఎస్ రెట్టింపు అభివృద్ధి చేసి ప్రజలకు సుపరిపాలన అందించిందని గుర్తు చేశారు. సీమాంధ్ర పాలనలో రైతులు కూలీలుగా మారారని, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వ్యవసాయాన్ని పండుగగా మార్చారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.