వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి

– రాష్ట్రపతికి విపక్షాల వినతి

దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రాష్ట్రపతితో విపక్ష నేతల సమావేశం ముగిసింది. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చూడాలని ఐదుగురి సభ్యులతో కూడిన విపక్ష నేతల బృందం రాష్ట్రపతిని కోరింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే ప్రతినిధి ఉన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం నేతలు విూడియాతో మాట్లాడారు.వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటాన్ని రాష్ట్రపతికి వివరించినట్టు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. చట్టాలను రద్దుచేసే వరకు అన్నదాతలతో కలిసి పోరాడతామని ఆయన స్పష్టంచేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వణికించే చలిలోనూ అహింసా మార్గంలో పోరాడుతున్న రైతులకు దేశమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారుతీవ్రమైన చలి ఉన్నా రైతులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ విధి అని చెప్పారు. వ్యవసాయ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు కోరాయని చెప్పారు. అయినా ఈ బిల్లులను హడావుడిగా ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు.వ్యవసాయ, విద్యుత్‌ సవరణ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించినట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి తెలిపారు. రెండు వారాలుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చూసైనా వారికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా కొత్త చట్టాలు చేసిందన్నారు. సలహాలు, సంప్రదింపులు జరపకుండానే బిల్లులను కేంద్రం ఆమోదించిందని ఏచూరి మండిపడ్డారు.