వ్యవసాయ చట్టాల రద్దుకు  రాష్ట్రపతి ఆమోదం 

` రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో గెజిట్‌ విడుదల

న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు పక్రియ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మూడు వ్యవసాయ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తరాది రాష్టాల్ర రైతులు ఏడాదిపైగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. నవంబర్‌ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజునే ఈ బిల్లును రికార్డు సమయంలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్‌ చేసినప్పటికీ లోక్‌సభలో కేవలం నాలుగు నిమిషాల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం సంతకం చేశారు. దీనిని గెజిట్‌లో పేర్కొనడంతో చట్టంగా మారింది.