వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందే ఖాతాల్లో పెట్టుబడి
అన్ని రకాల చర్యాలు చేపడుతున్నామన్న కడియం శ్రీహరి
సంగారెడ్డి,ఆగస్టు28 : రైతును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే పెట్టుబడి రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఆయన వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పశువుల మార్కెట్ యార్డ్ ను కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ భూముల సర్వేను పటిష్ఠంగా చేపట్టి ఈ పథకం పక్కదారి పట్టకుండా రైతులు సహకరించాలని కడియం కోరారు. రైతులను చైతన్య వంతులుగా చేసి క్రాఫ్ కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టులు, పంట పెట్టుబడి, మిషన్ భగీరథతో శుద్ధి చేసిన తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు సంవృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఓటు అడగటానికి అవకాశమే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.