వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఎలా?

అవే రేపటి రోజు యమపాశాలై వెన్నాడుతాయి

అధికారంలో ఉన్నామన్న అహంకారం సరికాదు

ఈ దుస్థితికి కాంగ్రెస్‌ కూడా కారణమే

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): దర్యాప్తు సంస్థలు నరేంద్ర మోదీ, అమిత్‌ షాల జేబు సంస్థలుగా మారిపోయాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌, ఇతరపార్టీలు యూపిఎ హయాంలో జరిగిన వ్యవహారాలను గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే గతంలో ఈ సంస్థలను ఎలా దుర్వినయోగం చేసిందీ మననం చేసుకోవాలి. దుర్వినయోగం అన్నది అధికారంలో ఉన్న పార్టీలకు అలవాటుగా మరింది. అందుకే స్వతంత్ర సంస్థలుగా దర్యాప్తు సంస్థుల ఉంటే ఇలాంటి ఆరోపణలు, అవకాశాలు వచ్చేవి కావు. కానీ వీటిని నిర్వీర్యం చేసిన ఘనత ఎక్కవకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌దే అని చెప్పడంలో సందేహం లేదు. అధికార బిజెపి

పెద్దల ఆదేశాల ప్రకారం, అందే జాబితా ప్రకారం సోదాలు, దాడులు, అరెస్టులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు కావాలనే ఇలా చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ,రాహుల్‌ కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. దశాబ్దాలుగా విలువలకు కట్టుబడి ఉన్న సంస్థలు కుప్పకూలిపోవడం దురదృష్టకరమే అయినా మూలాలలను వెతకాలి. వ్యవస్థలను బలోపేతం చేసి, స్వతంత్రంగా చేస్తే తప్ప దేశానికి మనుగడ లేదు. అధికారం ఏ ఒక్క వ్యక్తికీ, లేదాఆ ఒక్క పార్టీకీ శాశ్వతం కాదు. అయినా అధికారం శాశ్వతం అని భావిస్తూ విధ్వంసకర విధానాలకు పాల్పడుతున్నారు. సీబీఐలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత మన వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లింది. అత్యున్నత దర్యాప్తు సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం దారుణం కాక మరోటి కాదు. అవినీతి, అక్రమాలపై నిఘా వేసి అక్రమార్కులకు కళ్లెం వేయవలసిన వారే అవినీతి ఊబిలో చిక్కుకుంటే ఈ దేశానికి దిక్కేమిటి? రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి ఉపకరణంగా పనికొస్తాడని రాకేశ్‌ అస్థానా వంటి అధికారిని సీబీఐలోకి తెచ్చిన దరిమిలా ఇప్పుడు జరిగిన పరిణామాలతో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లక్ష్యం ఏమిటో బయటపడింది. సీబీఐని స్వతంత్రంగా పనిచేయనిస్తే అనేకమంది భరతం పట్టేవారు. దారికి రాని ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడానికి లేదా కక్ష సాధించడానికి వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో పెరిగాయి. వ్యవస్థలను స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యర్థుల అంతం చూడటానికి వాడుకునే వరకు వచ్చింది. అధికారంలో ఉన్న ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్‌ షా వీటిని విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్‌ బాధితుడే. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం అహంకారంతో వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న అభిప్రాయం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఆదాయపు పన్ను శాఖను వాడుకుంటున్‌ఆనరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థల దుర్వినియోగం పరాకాష్టకు చేరడంతో నిజంగా ఎవరు తప్పు చేశారో తెలుసుకోలేని స్థితిలో ప్రజలున్నారు. పదేళ్లపాటు అధికారం చలాయించిన యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఈ దుర్వినియోగంపై గొంతు చించుకుంటోంది. భారతీయ జనతా పార్టీ రాజ్యకాంక్షతో వ్యవస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్నది. వ్యవస్థలను గౌరవించడం ద్వారా దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలి. రాజకీయాల కోసం వాడుకుంటే అవే యమపాశాలై వెంబడిస్తాయి.