వ్యవస్థల పనితీరు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలి

రాజకీయ పార్టీల వ్యవహారాలపైనా అజమాయిషీ అవసరం
న్యూఢిల్లీ,నవంబర్‌14(జనం సాక్షి):  ప్రభుత్వంతో సహా వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే కొలీజియం వ్యవస్థపై ఎప్పటి నుంచో ఫిర్యాదులున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక కోసం అది అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో వెల్లడికావడం లేదన్న అనుమానాలు ఉన్నాయి.  ఎవరు ఎందుకు జడ్జిలుగా ఎంపికవుతున్నారో, ఎందుకు కావడం లేదో తెలుసుకోవడం పౌరసమాజం హక్కు. ఈ వ్యవస్థకు ఆద్యుడైన జస్టిస్‌ జేఎస్‌ వర్మ సైతం కొలీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కానీ ఈ అంశంలో సమాచార హక్కు చట్టం పరిధి తనకు వర్తించబోదని సుప్రీంకోర్టు వాదించింది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అలాంటి వాదన సరికాదని స్పష్టం చేయడం హర్షించదగ్గది. ఆర్టీఐ చట్టం విషయంలో భిన్న సందర్భాల్లో ఎవరెలా మాట్లాడుతున్నారో ప్రజలకు తేటతెల్లం అవుతూనే ఉంది. మాకు ఈ చట్టం వర్తించబోదని అన్వయించుకునే వారి జాబితా తక్కువేవిూ లేదు. చట్టం వచ్చినప్పుడే పాలనా పరంగా రహస్యాలు పాటించడం తప్పనిసరంటూ కొన్ని వ్యవస్థలకు మినహాయింపునిచ్చారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తదితర 22 సంస్థలు అందులో ఉన్నాయి. కొన్నిటిని అనంతరకాలంలో చేర్చారు. తమ కార్యకలాపాలు కూడా దీని పరిధిలోనికి రావని వాదించిన సంస్థలూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు అయితే తమకు సమాచార హక్కు చట్టం వర్తించదని, అవినీతి కూడా వర్తించదని వాదించే వారున్నారు. ఇవి ప్రభుత్వాల నుంచి రాయితీలు, మినహాయింపులు పొందడం దగ్గరనుంచి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల సేకరణ వరకూ ఎన్నో రకాలుగా లబ్ది పొందుతున్నాయి. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అయినా ఆర్టీఐ చట్టం తమకు వర్తించబోదంటూ తర్కిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చూశాకైనా ఇలాంటి వాదనలు తగ్గించుకుని పారదర్శకతకు తామూ సిద్దం అనగలగాలి. న్యాయమూర్తుల పదవులకు కొలీజియం సిఫార్సు చేసినవారి పేర్లేమిటో వెల్లడించవచ్చు తప్ప అందుకు గల కారణాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజా తీర్పు చెబుతోంది. అయితే అందరి విషయంలోనూ కారణాలు చెప్పకపోయినా, ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని భావించినవారికి అభ్యంతరం లేనప్పుడు ఏయే కారణాలరీత్యా తిరస్కరించవలసి  వచ్చిందో వెల్లడించడమే సరైంది. ఏదేమైనా అవసరమైన గోప్యతను పాటిస్తూనే పారదర్శకంగా ఉండటం, అదే సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటం ఒక సవాలే. రాజకీయ పార్టీలకు సంబంధించి ఆర్థికలావాదేవీల్లో పారదర్శక విధానాలు రావాల్సి ఉంది.