వ్యాపంపై సీబీఐ విచారణకు అంగీకరించిన ఎంపీ సీఎం చౌహాన్
భోపాల్,జులై7(జనంసాక్షి): వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఒత్తిడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీబీఐ విచారణకు హావిూ ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టుకు సిఫారసు చేస్తూ లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన నాలుగు ఫిటిషన్లపై ఈ నెల 9వ తేదీన సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం విూడియా సమావేశం ఏర్పాటు చేసి.. పై వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆందోళనను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మధ్యప్రదేశ్ వృత్తివిద్యా మండలి ప్రవేశాలు, నియామకాల(వ్యాపం) కుంభకోణంపై సీబీఐతో విచారణ చేపట్టాలని సిపార్సు చేశారు. ఈ కుంభకోణపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై తానేవిూ మాట్లాడనన్నారు. వ్యాపం కుంభకోణంపై దర్యాప్తు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. న్యాయ వ్యవస్థ విూద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజల డిమాండ్ మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని ఆయన ప్రకటించారు. వ్యాపం కుంభకోణంకు సంబంధించి వరస మరణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.