శతృదేశం దక్షిణ కొరియాపై అక్కసు
ఆ దేశ వీడియోలు చూసిన ఏడుగురికి ఉరి
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నిరంకుశ ఆదేశాలు
సియోల్,డిసెబర్21( జనం సాక్షి): దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలు చూసినందుకు ఏడుగురికి ఉరిశిక్ష విధించారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలను అక్కడి పాలకులు అమలు చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని ఒక మానవ హక్కుల సంస్థ చెప్పింది. కేవలం కొన్ని దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురు అమాయకులకు ఆయన ఉరిశిక్ష విధించాడని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంస్థ తన నివేదికలో తెలిపింది. ఆ ఏడుగురు కేవలం దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియాలను చూసి వాటిని సీడీలు, యుఎస్‌బీలలో కాపీ చేసి అక్రమంగా విక్రయించినందుకు వారిని ఉరి తీసి చంపారు.
శత్రుదేశమైన దక్షిణ కొరియా పట్ల తమ దేశ వాసులేవరికీ సానుభూతి ఉండకూడదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జో గతంలో పలుమార్లు తన ప్రసంగాలలో చెప్పారు. దక్షిణ కొరియా నుంచి వలస వచ్చి ఉత్తర కొరియాలో నివాసముంటున్న వారిని అన్యాయంగా కిమ్ జో హింసిస్తున్నాడని ఆ మానవ హక్కుల సంస్థ చెప్పింది.