శబరిమలకు పెరుగుతున్న భక్తులు

12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

తిరువనంతపురం,నవంబరు19(జనం సాక్షి): శబరిమల యాత్రకు వెళ్లిన 12 ఏళ్ల బాలికను కేరళ పోలీసులు అడ్డుకున్నారు. శబరిమల ఆలయ ద్వారాలు ఈ నెల 16వ తేదీన తెరుచుకున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. శబరిమలలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో మహిళలు అయ్యప్ప దర్శనం కోసం అక్కడికి వెళ్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మహిళా భక్తులను అడ్డుకుంటున్నారు. మంగళవారం ఉదయం 12 ఏళ్ల బాలికను పోలీసులు అడ్డుకున్నారు. ఈ బాలిక తన కుటుంబ సభ్యులతో పుదుచ్చేరి నుంచి వచ్చారు. బాలికను చూసిన పోలీసులు వయసును నిర్దారించుకునేందుకు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలని ఆమె కుటుంబ సభ్యులను ఆదేశించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆధార్‌ కార్డు చూపించారు. బాలిక వయసు 12 సంవత్సరాలు కావడంతో ఆమెను టెంపుల్‌లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక శనివారం రోజు 10 మంది మహిళలను, సోమవారం ఇద్దరు మహిళా భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. అన్ని వయసుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబర్‌ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవిూక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.