శబరిమలకు వెళ్తున్నా!

– ఆలయానికి వెళ్లే తేదీని త్వరలో ప్రకటిస్తా
ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ నేత తృప్తీ దేశాయ్‌ స్పందించింది. శబరిమలకు వెళ్లేందుకు తాము ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపింది. శబరిమల ఆలయానికి వెళ్లే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆమె పేర్కొన్నది. ఇప్పుడు మాకు సమాన హక్కులు ఉన్నాయని, మమ్మల్ని ఎవరూ ఆపకూడదని ఆమె వెల్లడించింది. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతి కల్పించాలంటూ తృప్తీ దేశాయ్‌ గతంలో ఉద్యమం లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే అయ్యప్ప భక్తుల మనోభావాలను సవాల్‌ చేస్తూ ఎవరూ దురుసుగా ప్రవర్తించరాదు అంటూ కేరళ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. శబరిమలకు వచ్చే మహిళలను అడ్డుకునేందుకు కేరళ శివసేన కూడా వార్నింగ్‌ ఇచ్చింది. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు సూసైడ్‌ గ్రూపుగా మారనున్నట్లు ఆ పార్టీకి చెందిన ప్రతినిధి తెలిపారు. అక్టోబర్‌ 17, 18వ తేదీన పంబా నది వద్ద తమ కార్యకర్తలు ఉంటారని, ఎవరైనా మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని వస్తే, తమ కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడుతారని కేరళ శివ
సేన హెచ్చరించింది.