శబరిమల జోలికి వస్తే..  ఆత్మహత్యలే

– హెచ్చరించిన శివసేన
– సుప్రింకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ
తిరువనంతపురం, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) :  సుప్రీంకోర్టు తీర్పుతో కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం సుగగమైనా…ఇందుకు వ్యతిరేకంగా నిరసనలు ఎగసిపడుతున్నాయి. బహిరంగ హెచ్చరికలూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శివసేన సైతం ఇదే బాట పట్టింది. యువ మహిళలు ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే తమ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారని శివసేన కేరళ యూనిట్‌ నేత పెరింగమ్మల ఆజి శనివారం హెచ్చరించారు. ఈనెల 17, 18 తేదీల్లో తమ ‘ఆత్మహత్యల బృందం’ పంబానది వద్ద సమావేశమవుతుందని ఆయన చెప్పారు. వెటరన్‌ నటుడు కొల్లాం
తులసి ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయానికి వచ్చే మహిళలను రెండు ముక్కలు చేస్తామంటూ హెచ్చరించారు. ఒక ముక్క ఢిల్లీకి పంపుతామని, మరో ముక్క తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోకి విసేరాస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఆ వ్యాఖ్యలు ఉండటంపై ఆయనపై శనివారం కేసు నమోదైంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఇందుకు వ్యతిరేకంగా బీజేపీ, యూడీఎఫ్‌ తదితర పార్టీలు కొద్దిరోజులుగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పందాళం రాజవంశీయులు శుక్రవారం నిరాహార దీక్షలో పాల్గొనడం పరిస్థితి తీవ్రతను పెంచుతోంది. కాగా, వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరికి శబరిమల ఆలయ ప్రవేశానికి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది.