శభాశ్‌… హరీశ్‌!

5

షఫీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి

హైదరాబాద్‌ సెప్టెంబర్‌7(జనంసాక్షి):

సార్వత్రిక సమ్మె వేళ భార్య శవంతో, పురిటి బిడ్డతో నరకం చవిచూసిన మహబూబ్‌నగర్‌ జిల్లా వూట్కూరుకు చెందిన షఫీకి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. షఫీ పరిస్థితి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు… అతడికి వూట్కూరు మార్కెట్‌ యార్డులో సెక్యూరిటీగార్డుగా ఉద్యోగం కల్పిస్తూ సోమవారం నియామకపత్రం అందించారు. తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం షఫీ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేసింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మండల కేంద్రం వూట్కూరుకు చెందిన మహ్మద్‌ షఫీ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో హైదరాబాదుకు వలస వెళ్లాడు. కాటేదాన్‌ ప్రాంతంలో ఉంటూ మట్టిపనికి వెళ్లేవాడు. ఉదయమే వెళ్లి రాత్రి పదింటికి తిరిగివచ్చేవాడు. భార్య నుస్రత్‌బేగం (20) నిండుగర్భిణి. మంగళవారం ఉదయం షఫీ కూలికెళ్లాక సాయంత్రం ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఎలాగోలా దగ్గరున్న ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం నుస్రత్‌ మృతిచెందడంతో ఆసుపత్రి సిబ్బంది తల్లి శవాన్ని, చిన్నారిని బయట రోడ్డుపై వదిలేశారు. చూసినవారంతా అయ్యో! అనడమే కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 10.30కు ఇంటికి వచ్చిన షఫీ..అమ్మ ఎక్కడని పిల్లల్ని అడగడంతో ఆసుపత్రికి వెళ్లిందని చెప్పారు. పరుగున అక్కడికెళ్లి చూసేసరికి.. రోడ్డుపై భార్య శవం, పక్కన పురుటిబిడ్డ! ఆ దృశ్యం చూసి కట్టలుతెగిన శోకంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఎలా చనిపోయిందని అడిగితే ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి భార్య శవాన్ని, పిల్లలను తీసుకొని అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో బయలుదేరి మహబూబ్‌నగర్‌కు వచ్చాడు. మొదట శవాన్ని బస్సులో తరలించడానికి నిరాకరించిన సిబ్బంది షఫీ పరిస్థితికి చలించి అనుమతించారు. బుధవారం ఉదయం అయిదింటికి మహబూబ్‌నగర్‌లోదిగితే.. సార్వత్రిక సమ్మెతో రవాణా బందు అని తెలిసింది.

షఫీ దయనీయ స్థితి సమ్మెచేస్తున్న కార్మికులకు, ఆర్టీసీ సిబ్బందికి, స్థానికులకు తెలియడంతో వారే ముందుకొచ్చి ఆటో మాట్లాడి శవాన్ని వూట్కూరుకు తరలించారు. అతని చెంత చిల్లిగవ్వ లేదని గమనించి ఆర్టీసీ కార్మికులు రూ.ఆరువేలు, అక్కడే టీకొట్టు పెట్టుకున్న వెంకటయ్య రూ.1000.. ఇలా అంతా తోచిన సాయంచేశారు. తల్లిపాలూ కరవైన పురుటిబిడ్డను జిల్లా బాలల సంరక్షణ అధికారులు పెద్దాసుపత్రికి తరలించారు.